Odisha Train Tragedy : ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 288 మంది మృతి చెందారు. 1,175 మందికి పైగా గాయాలపాలయ్యారు. వారిలో ఇప్పటివరకు 793 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఆస్పత్రుల్లో 382 మందికి చికిత్స జరుగుతోంది. అయితే, క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో మూడు రోజులపాటు సహాయక చర్యలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఒడిశా రైలు ప్రమాదంలో తెలుగు ప్రయాణికుల లెక్కపై గందరగోళం నెలకొంది. అసలు రెండు రైళ్లు ఎక్కిన తెలుగువారు ఎంతమంది?. ప్రాణాలు కోల్పోయింది ఎందరు? ఆచూకీ దొరకనివారు ఎంత మంది ఉన్నారుది? ఎంతమంది గాయపడ్డారు?. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లిపోయింది ఎందరు ? ఈ లెక్కపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది.
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 482 మంది తెలుగువాళ్లు ఎక్కినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఇందులో 267మంది సురక్షితంగా బయటపడ్డారు. మరి, మిగిలిన 113 మంది ఏమైపోయినట్టు?. జనరల్ బోగీల్లో ఎక్కిన తెలుగువారు ఎంతమంది?. ఈ లెక్కే సరిగ్గా తేలడం లేదు. మిస్ అయిన ప్రయాణికుల ఫోన్లు స్విచ్ఛాప్ కావడంతో కుటుంబ సభ్యలు, బంధువుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
ఇక హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 89మంది తెలుగువారు ప్రయాణిస్తే, అందులో 49 మంది సురక్షితంగా ఉన్నట్టు తేలింది. ఇంకా 28 మంది ప్రయాణికుల ఆచూకీపై గందరగోళం నెలకొంది. వీరు ఏమైయ్యారో ట్రేస్ చేసేందుకు ఏపీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.