వరంగల్ బహిరంగ సభలో తూర్పు టికెట్ పై స్పష్టతనివ్వని కేటీఆర్?
నన్నపునేని ఆశలపై నీళ్లు చల్లిన ఎర్రబెల్లి?
నరేందర్ అభిమానుల్లో మొదలైన టెన్షన్?
కేటీఆర్ ప్రసంగంపై స్థానిక ఎమ్మెల్యే అయోమయం?
పొలిటికల్ బ్యూరో, ప్రజాసర్కార్: వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఓ ఎమ్మెల్యేకు ఉత్సాహాన్నిస్తే మరో ఎమ్మెల్యే ను మాత్రం అయోమయంలో పడేసినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో శనివారం పర్యటించిన కేటీఆర్.. పరకాల నియోజకవర్గంలోని మెగా టెక్స్ టైల్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఏర్పాటు చేసిన సభలో పాల్గొని పరకాల నియోజకవర్గంలో “చల్లా” పై పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకడంలేదని, ధర్మన్నను చూస్తుంటే సంబరమేస్తుందని వ్యాఖ్యానించారు. సభలో కేటిఆర్ మాటలు విన్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి తోపాటు, నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు పరకాల టికెట్ పై స్పష్టత వచ్చినట్లయింది.
ఇదంతా బాగానే ఉన్నా గత కొన్నిరోజులుగా కేటిఆర్ తో బహిరంగ సభలో మాట్లాడించి తన అభ్యర్థిత్వానికి భరోసా కల్పించుకోవాలనుకున్న తూర్పు ఎమ్మెల్యే కు మాత్రం నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సమీకృత కలెక్టరేట్, మోడల్ బస్టాండ్ తోపాటు ఇతర అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నరేందర్ ఆజాంజాహి మిల్లు గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మాటల్లో నరేందర్ టికెట్ పై స్పష్టతనివ్వకపోవడంతో ఎమ్మెల్యే నరేందర్ తోపాటు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురైనట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే నరేందర్ అంగరంగ వైభవంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తనదైన శైలిలో బహిరంగ సభకు ప్రజలను భారీగా తరలించి సభను విజయవంతం చేశారు. అయినప్పటికీ నన్నపునేని టికెట్ పై కేటిఆర్ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం.
నరేందర్ ఆశలపై నీళ్లు?
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. స్థానిక ఎమ్మెల్యే నరేందర్.. తూర్పు టికెట్ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో నన్నపునేని నరేందర్ కష్టపడుతున్నారని నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. రానున్న ఎన్నికల్లో తూర్పులో కేసీఆర్ ఎవరికి టికెట్ కేటాయించినా గెలిపించుకుంటామని వ్యాఖ్యలు చేయడం.. స్థానిక ఎమ్మెల్యే తోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలకు మింగుడు పడలేదని విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా రాజకీయాల్లో ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.