పదేళ్లుగా 10 హత్యలు
ఫుట్ పాత్ పై పడుకున్నవారిపై బండరాయితో చంపి డబ్బుతో పరార్..
Hyderabad Serial Killer : రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లిలో తీవ్ర కలకలం సృష్టించిన మూడు వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదిచారు.
హత్యలు జరిగిన 12 గంటల్లోనే సీపీ పుటేజీ ఆధారంగా హంతకుడ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ సైకో కిల్లర్‌ని మైలార్‌దేవ్ పల్లి లక్ష్మీగూడ రాజీవ్ గృహ కల్పకు చెందిన ప్రవీణ్‌గా గుర్తించారు. నేతాజీ నగర్, దుర్గానగర్ చౌరస్తా, కాటేదాన్‌లో జరిగిన మూడు హత్యల్ని తానే చేసినట్లు కిల్లర్ అంగీకరించాడు. తాగిన మైకంలో నిద్రిస్తున్నవారే ఇతడి టార్గెట్. బండరాయి తలపై మోది సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోవడమే ఈ సైకో కిల్లర్ స్టైల్.. రాజేంద్రనగర్‌లో ఇదే తరహాలో మర్డర్ చేశాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లోనూ ఇతనిపై హత్యకేసు నమోదైంది. అయితే.. మూడు హత్యలు జరిగాక, ఈ కేసుని పోలీసులు సీరియస్‌గా తీసుకొని, 12 గంటల్లోనే ఇతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు వివరాల్ని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. మైలార్‌దేవ్ పల్లిలో ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రవీణ్‌ని అదుపులోకి తీసుకున్నామని, తాగిన మైకంలో నిద్రిస్తున్న వారినే అతడు టార్గెట్ చేస్తుంటాడని తెలిపారు. హంతకుడ్ని సైకో ప్రవీణ్‌గా గుర్తించామన్నారు. మద్యం సేవించి రోడ్డుపక్కన నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసి, ప్రవీణ్ హత్యలు చేస్తున్నాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నామని, చాలా ఆధారాలు సేకరించామన్నిరు. హత్యలు జరిగిన 12 గంటలోనే హంతకుడిని ట్రేస్ చేసి, పట్టుకున్నామన్నారు. ప్రవీణ్‌పై గతంలోనే మూడు హత్యలు, రెండు చోరీ కేసులూ ఉన్నాయన్నారు. 2014లో జీవిత ఖైదు పడింది. ఇతనికి ప్రతీ కేసులోనూ శిక్ష పడిందన్నారు. 2011లో పిల్లర్ నంబర్ 127 వద్ద పడుకున్న యాచకుడిని ప్రవీణ్ హతమార్చినట్లు తేలిందని.. 2011లో 302 & 307 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల రాజేంద్రనగర్‌లోని బుద్వేల్ వద్ద ఓ బిక్షగాడిని హత్య చేశాడన్నారు.
ఒకే కుటుంబంలోని ముగ్గురి హత్య
రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీకి చెందిన బ్యాగరి ప్రవీణ్(34) చిన్నతనంలోనే చోరీలకు అలవాటుపడ్డాడు. రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ ఫయాజ్, దర్గా నరేశ్‌తో కలిసి ముఠా కట్టిన ప్రవీణ్..2011లో రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో ఓ ఇంట్లో దోపిడీకి ప్లాన్ వేశాడు. అర్ధరాత్రి ముగ్గురూ కలిసి ఆ ఇంటికి వెళ్లారు. అదే సమయంలో కుటుంబ యజమాని యాదయ్య మూత్ర విసర్జన కోసం బయటకు రాగా బండరాయితో కొట్టి చంపారు. ఆయన భార్యపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశాడు. అలికిడితో నిద్రలేచిన పదేళ్ల ఆమె కొడుకును కూడా హతమార్చారు. ఆభరణాలు, డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ మూడు హత్యలు చేసిన తర్వాత ప్రవీణ్ స్నానం చేసి అక్కడే ఉన్న గుడిలో పూజలు చేసినట్టు పోలీసులు అప్పట్లో గుర్తించారు.
జరిగిన హత్య కేసులన్నీ సేమ్ సీన్ నేరాన్ని తలపించాయని డీసీపీ తెలిపారు. బెగ్గర్‌ల వద్ద పడుకున్నట్టు నటించి, అందరూ పడుకున్నాక బండరాయి వేసి హతమారుస్తాడని తెలిపారు. ప్రవీణ్‌కి మొత్తం 10 ఏళ్లపాటు జైలు శిక్ష పడిందన్నారు. ‘మైలార్‌దేవ్ పల్లి లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో నిందితుడు ప్రవీణ్ కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. ఇప్పటివరకు 8 మందిని హత్య చేసినట్లు తమ విచారణలో తేలింది. 2010, 2011లో జరిగిన 8 పాత హత్య కేసుల్లోనూ ప్రవీణ్ ప్రధాన నిందితుడని తెలిపారు. ఇతనికి పాత నేరస్తులు ఫయాజ్, నరేష్2లు అసోసియేట్‌గా ఉన్నారని తెలిపారు.
ఔను.. చంపేశాను.. ఇప్పుడేంచేద్దాం..
హత్యలు ఎందుకు చేశాని ప్రవీణ్ ను పోలీసులు అడిగినప్పుడు విస్తుగొలిపే కారణాలు చెబుతున్నాడు. అవును చంపేశాను.. ఇప్పుడు ఏం చేద్దాం అని బదులిచ్చినట్లు తెలిసింది. తమపై చేతబడి చేస్తారన్న భయంతో, మద్యం సేవించేందుకు డబ్బుల కోసం హత్యలు చేస్తున్నానని అతడు కారణాలు చెప్తున్నాడని పోలీసులు తెలిపారు. సైకో కిల్లర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్న ఆయన.. నిందితుడ్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు.