జీడబ్ల్యూఎంసీ సిటీ ప్లానర్ వెంకన్న నిర్లక్ష్యంతో నగరంలో అనేక అక్రమ నిర్మాణాలు
అక్రమ కట్టడాలను అరికట్టడంలో విఫలం
విచ్చలవిడిగా నగర వ్యాప్తంగా అక్రమ వెంచర్ లు
అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు.. అంతాతెలిసి ఎందుకీ మౌనం?
బ్యూరో, ప్రజా సర్కార్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమో? అధికారుల చేతివాటమో తెలియదు గానీ.. ఇప్పుడు గ్రేటర్ వరంగల్ నగర వ్యాప్తంగా అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బిల్డర్లు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు, వెంచర్లను అరికట్టడంలో సిటీ ప్లానర్ వెంకన్న విఫలమైనట్లు తెలుస్తోంది. నగరంలో ఉన్న అక్రమ వెంచర్లు, నిర్మాణాలను చూస్తే సిటీ ప్లానర్ ఏ స్థాయిలో విఫలమయ్యారో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ అధికారుల ఆశీస్సులతో అనేక డివిజన్లలో రియల్టర్లు, బిల్డర్ల దందా జోరుగా సాగుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగాధిపతిగా ఉన్న వెంకన్న నిర్లక్ష్యంతోనే గ్రేటర్ లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయనేది కాదనలేని సత్యం.
అక్రమ వెంచర్ల జోరు..
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ వెంచర్ ల జోరు కనపడుతోంది.. నగర శివార్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న చిన్న అక్రమ వెంచర్ లు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. జీడబ్ల్యూఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో రియల్టర్లు ఇష్టారీతిలో వెంచర్లు చేస్తూ అందులోని ప్లాట్లను అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. అక్రమ వెంచర్ లను అడ్డుకోవాల్సిన అధికారులే రియల్టర్ లకు పూర్తి స్థాయిలో ఆశీస్సులు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
గ్రేటర్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అనుమతులు పొందిన విధంగా కాకుండా తమ ఇష్టానుసారంగా బిల్డర్ నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రేటర్ లో చాలా చోట్ల అదనపు అంతస్థుల నిర్మాణం, రెసిడెన్షియల్ అనుమతి తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు చేపట్టడం, అనుమతి లేకుండా అపార్ట్ మెంట్ లు నిర్మించడం.. ఇలా అనేక రకాలుగా బిల్డర్ లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
అన్నీ తెలిసీ మౌనంగా సిటీ ప్లానర్…?
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్ల వ్యవహారం ప్రజావాణి ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా సిటీ ప్లానర్ దృష్టికి వచ్చినప్పటికీ ఆయన మాత్రం తనకేంపట్టనట్లు వ్యవహరిస్తున్నారని నగర వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగానికి అధిపతిగా ఉన్న ఈ అధికారి అక్రమ వెంచర్ లు, అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది అర్ధంకాని ప్రశ్నగా మారిందని పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికైనా సిటీ ప్లానర్ మౌనం వీడతారా? ఎలాంటి చర్యలు తీసుకుంటారా? అనేది చూడాల్సిందే…