సిటీ ప్లానర్ పర్యవేక్షణ లేక విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు
కంచర కుంటలో గృహ నిర్మాణానికి అనుమతి తీసుకుని అపార్ట్ మెంట్ నిర్మాణం
హన్మకొండ కిషన్ పుర నాల పక్కనే నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్ మెంట్
అంతా తెలిసి గమ్మునున్న సిటీ ప్లానర్
హన్మకొండ ప్రతినిధి/ప్రజాసర్కార్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో కొంతమంది బిల్డర్ లు రెచ్చిపోతున్నారు. అరకొర అనుమతులతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు.టౌన్ ప్లానింగ్ విభాగంలో లోని కొంతమంది పైస్థాయి అధికారులకు ముడుపులు ముట్టజెప్పి అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నట్లు నగర వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి సిటీ ప్లానర్ గా వెంకన్న భాద్యతలు చేపట్టినప్పటినుండి నగరంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పక తప్పదు. ఇటీవలే నగరంలోని కంచరకుంట లో ఓ బిల్డర్ అనుమతి లేకుండా అపార్ట్ మెంట్ నిర్మించినట్లు ,దానికి సిటీ ప్లానర్ పూర్తిసహకారం అందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది దానికి పారితోషికంగా సదరు బిల్డర్ ఆ అధికారికి పెద్దమొత్తంలో ముడుపులు ముట్టజెప్పినట్లు కార్పొరేషన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుండగా హన్మకొండ కిషన్ పుర నాలా పక్కనే మరో బిల్డర్ తన ఇష్టానుసారంగా అపార్ట్ మెంట్ నిర్మించి అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.బిల్డర్ తన ఇష్టారాజ్యంగా నిర్మించిన ఈ అపార్ట్ మెంట్ అనుమతులు మతలబేంటో సిటీ ప్లానర్ కే తెలియాలి ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాలపై సమీక్షించి వాటిని అడ్డుకోవాల్సిన సిటీ ప్లానర్ తనకేంపట్టనట్లు వ్యవహరిస్తున్నారనేది నగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అక్రమ నిర్మాణాల విషయం సిటీ ప్లానర్ కు తెలిసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వం లో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవిధంగా సిటీ ప్లానర్ వ్యవహరించడం పట్ల పలువురి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.