కట్నం ఇవ్వలేదని పెళ్లి పీటలపై నుంచే పారిపోయిన వరుడు

కట్నం ఇవ్వలేదని పెళ్లి పీటలపై నుంచే పారిపోయిన వరుడు

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని పెళ్లిపీటలపై నుంచి వరుడు పారిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, అలాగే కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అతడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మరో విషయం ఏంటంటే ఈ సంవత్సరం జనవరిలోనే కంగ్టి మండలానికి చెందిన మరో యువకుడితో ఆ యువతికి నిశ్చితార్థం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న ప్రియుడు అతనికి ఫోన్‌ చేసి… తాను ఆమెను ప్రేమిస్తున్నానని, వదిలేయాలంటూ బెదిరించాడు. దీంతో అతను పెళ్లికి నిరాకరించాడు. చివరికి ప్రేమికులిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు అంగీకరించాయి.
కొండాపూర్ మండలంలోని ఓ గుడిలో శుక్రవారం వివాహానికి అన్నీసిద్ధం చేశారు. ఇక పెళ్లి రోజున అంతా సక్రమంగా సాగుతున్న వేళ పెళ్లి కొడుకు కట్నం సరిపోలేదంటూ వాగ్వాదానికి దిగాడు. రూ.15 లక్షలు కట్నం ఇస్తేనే తాళి కడతానని అతడు తేల్చిచెప్పాడు. అయితే అంత మొత్తం ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబ సభ్యులు చెప్పినా వినిపించుకోలేదు. చివరికి పెళ్లి పీటలపై నుంచి పరారయ్యాడు. ఆ వరుడి కోసం బంధుమిత్రులు ఎంత వెతికినా, ఫోన్ చేసినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఇక చేసేదేమి లేక బాధిత వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *