- గుజరాత్‌లో అంధకారంలో 1,000 గ్రామాలు,
- గుజరాత్‌లోని బిపార్‌జోయ్ ప్రభావిత ప్రాంతాలలో 99 రైళ్లు రద్దు
- నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
- తుఫాను దాటికి ఇద్దరి మృతి, 22 మందికి గాయాలు
Cyclone Biparjoy Updates : గుజరాత్‌లో బీపర్‌జోయ్ తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. తుఫాను ధాటికి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు మరణించారు. 22 మంది గాయపడ్డారు, పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. అనేక వాహనాలు ఇళ్ళు దెబ్బతిన్నాయి. రాజస్థాన్ మీదుగా తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. బిపార్జోయ్ తుఫాను క్రమంగా బలహీనపడి గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలపై తుఫానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత ఈ సాయంత్రం తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్‌లో తెలిపింది.
భారీ వర్షంతో పాటు బలమైన గాలులతో గుజరాత్‌లోని వివిధ ప్రదేశాలలో 524 చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, దాదాపు 1,000 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. 10 రోజులకు పైగా అరేబియా సముద్రం దాటిన తర్వాత , తుఫాను బిపార్జోయ్ గుజరాత్‌లోని జఖౌ నౌకాశ్రయం సమీపంలో గురువారం సాయంత్రం 125 kmph నుంచి 140 kmph మధ్య గాలి వేగంతో తీరం దాటింది. అయితే కొన్ని గంటలపాటు క్రమంగా వేగం మందగించింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి 2:30 గంటలకు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
రాజస్థాన్ వైపు తుఫాన్..
తుఫాను వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్(Rajasthan)లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. అధిక వేగంతో వీస్తున్న గాలులు, అలలు, భారీ వర్షాల కారణంగా తాత్కాలిక గృహ నిర్మాణాలకు భారీ నష్టం జరగడంతోపాటు చెట్లు, కొమ్మలు కూలిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
అంతకుముందు రోజు, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో టెలిఫోన్ లో మాట్లాడారు. తుఫాను పరిస్థితిని సమీక్షించారు. గిర్ ఫారెస్ట్‌లో సింహాలు సహా వన్యప్రాణుల భద్రత ఏర్పాట్ల వివరాలను కూడా ప్రధాని మోదీ అడిగారు.
94,000 మంది ప్రజలు తీరప్రాంతం, లోతట్టు ప్రాంతాల నుండి ఆశ్రయం పొందారని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. తుపాను ప్రభావం రైళ్ల రాకపోకలపైనా పడింది. గుజరాత్‌లోని బిపర్‌జోయ్ ప్రభావిత ప్రాంతాలలో నడుస్తున్న దాదాపు 99 రైళ్లు రద్దు చేశామని పశ్చిమ రైల్వే తెలిపింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)కు చెందిన పద్దెనిమిది బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) 12, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన 397 బృందాలు కోస్తా జిల్లాల్లో రంగంలోకి దిగాయి.
శనివారం వరకు ఫిషింగ్ కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి, ఓడరేవులు మూసివేశారు. ఓడలన్నీ నిలిపివేశారు. రెండు ప్రసిద్ధ ఆలయాలు — దేవభూమి ద్వారకలోని ద్వారకాధీష్ ఆలయం, గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయం తెరుచుకోలేదు.
గుజరాత్‌లోని జామ్‌నగర్ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు శుక్రవారం వరకు నిలిపివేయబడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో విమానాశ్రయాన్ని నడపడానికి అవసరమైన ఇంధనం నిల్వ ఉంచినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.