-
ఎల్కతుర్తి మండలం దామెర లో ఇష్టారాజ్యంగా వెంచర్ చేసిన రియల్టర్ లు
-
కుడా అనుమతి లేకుండా దర్జాగా వెంచర్
-
అక్రమ వెంచర్ లో 55 ప్లాట్లు
-
గజానికి 6 వేల చొప్పున అమ్మకం?
-
అనుమతి లేదు వసతులు అసలే కల్పించరు
హన్మకొండ, (ప్రజాసర్కార్) : హన్మకొండ జిల్లాలో రియల్టర్ లు రెచ్చిపోతున్నారు.. ఎటువంటి అనుమతులు లేకుండానే వెంచర్ లు చేస్తూ అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. నగర శివార్లలో భూములను తక్కువ రేటుకు కొనుగోలు చేసి తూతుమంత్రంగా ప్లాట్లు చేస్తూ కలర్ ఫుల్ బ్రోచర్ లతో మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇదే తరహాలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో ఓ 3 ఎకరాల భూమిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ నిర్మించిన రియల్టర్ లు.. 55 ప్లాట్లు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. ‘కుడా’ పరిధిలో ఉన్న ఈ భూమిని ‘కుడా’ అనుమతులు పొందకుండానే అక్రమంగా వెంచర్ చేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నట్లు తెలిసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేసిన ఈ వెంచర్ లోని ప్లాట్లను రియల్టర్ లు గజానికి 6 వేల చొప్పున అమ్మడం గమనార్హం. అనుమతి లేని వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్ లో ఇల్లు కట్టుకోడానికి పర్మిషన్ రాదని తెలిసి కూడా రియల్టర్ లు వారి స్వలాభం కోసం మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లను అమ్ముతూ వారిని మోసం చేస్తున్నట్లు తెలిసింది
అనుమతులు, వసతులు అసలే కనిపించవు..
ఎల్కతుర్తి మండలం దామెర శివార్లలో చేసిన ఈ వెంచర్ కు ‘కుడా’ నుండి ఎలాంటి అనుమతులు లేవని సమాచారం. damera venchar లో ఉండాల్సిన కనీస వసతులు అయినటువంటి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, పార్కు తదితర సౌకర్యాలు ఏవీ కూడా అక్కడ కనిపించవు. ఎలాంటి అనుమతి లేకుండా వెంచర్ చేయడమే కాకుండా కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఈ రియల్టర్ లు బ్రోచర్ లో అన్ని హంగులు ఉన్నట్లు చూపించి అమ్మకాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.