రాష్ట్రంలోనే తొలిసారి వరంగల్ లో అమలు
వరంగల్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యుఎంసీ) వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది. నగరవాసులు తమ ఇంటి, నీటి పన్నులను సులభంగా చెల్లించడానికి డిజిటల్ బార్ కోడ్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రకటించారు. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడం.. పన్ను చెల్లింపుదారులపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ డిజిటల్ బార్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో తొలిసారిగా డిజిటల్ బార్ కోడ్ విధానాన్ని ఉపయోగిస్తున్నాం. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి వారి పన్ను బిల్లుపై డిజిటల్ బార్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా పన్ను చెల్లించవచ్చు. చెల్లింపుదారులు ఇప్పుడు జీడబ్ల్యూఎంసీ కార్యాలయాలకు రాకుండానే తమ పన్నులను చెల్లించవచ్చు. మేము డిమాండ్ నోటీసుల్లో ‘డిజిటల్ బార్ కోడ్ లను’ చేర్చాము. ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి బార్ కోడ్ ను సులభంగా స్కాన్ చేయడానికి, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తాము.” అని ఆయన చెప్పారు.
డిజిటల్ బార్ కోడ్ చెల్లింపు విధానం సురక్షితమైన లావాదేవీ ప్రక్రియ అని తెలిపారు. ఆన్ లైన్ చెల్లింపుల వల్ల జీడబ్ల్యూఎంసీ కార్యాలయాలను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నారు. అలాగే ఆఫీసుల్లో క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుందని కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు.