అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోని కుడా అధికారులు
కుడా ఆదాయానికి భారీ గండి కొడుతున్నా గమ్మునున్న అధికారులు?
అధికారుల మౌనం వెనుక అంతర్యమేమిటో?
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర లో రియల్టర్ ల ఇష్టారాజ్యం
హన్మకొండ ప్రతినిధి/ప్రజాసర్కార్: కుడా పరిధిలో అనేక అక్రమ వెంచర్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రియల్టర్ లు బహిరంగంగా వెంచర్ లు చేస్తున్నప్పటికీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అనేకం. కుడాలోని కొంతమంది అవినీతి అధికారుల ప్రోత్సాహం వల్లే రియల్టర్ ల అక్రమ వెంచర్ ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందనేది బహిరంగ రహస్యం. ఇటీవలే రియల్టర్ లు
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో కుడా ఆదాయానికి భారీగా గండి కొట్టి అక్రమ వెంచర్ చేసినా “కుడా”అధికారులకు మాత్రం ఆ వెంచర్ కనపడటం లేదు.ఇదే విషయాన్ని “ప్రజాసర్కార్” కుడా అధికారులు దృష్టి కి తీసుకెళ్లినా వారు ఆ వెంచర్ పై చర్యలు తీసుకోవడమేమో కానీ కనీసం ఆ అక్రమ వెంచర్ ను పరిశీలించిన దాఖలాలు కూడా లేవని సమాచారం. కుడా నుండి జీతాలు పొందుతూ కుడా ఆదాయానికి భారీగా గండి పడుతున్నా ఈ అధికారులు మాత్రం తమకేంపట్టనట్లు వ్యవహరించడం చూస్తుంటే రియల్టర్ లకు అధికారులకు ఏ స్థాయిలో ఒప్పందం కుదిరిందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకుంటారో లేదంటే వీరు కూడా రియల్టర్ లకు సహకరిస్తారో అనేది రెండుమూడు రోజుల్లో తేలనుంది.