హసన్ పర్తి మండలం మునిపల్లి చెరువులో అక్రమంగా ప్రహరీ ?
ఐబీ అధికారులకు కనపడని చెరువులోని ప్రహరీ
చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు
హన్మకొండ ప్రతినిధి/ప్రజాసర్కార్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో చెరువులకు రక్షణ లేకుండా పోయింది.నగరంలో అనేక చెరువులు రియల్టర్ ల చేతుల్లో బంధీగా ఉన్నాయి. హసన్ పర్తి మండలం భీమారం శ్యామల చెరువు 30 ఎకరాల పైన కబ్జా అయిన విషయం నగరం మరువకముందే ఇప్పుడు అదే మండలంలోని మునిపల్లి గ్రామంలోని చెరువులో అక్రమంగా ప్రహరీ నిర్మించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చెరువులో ప్రహరీ నిర్మించిన వారు అదే చెరువులోని మట్టిని తీసి తను నిర్మించిన ప్రహరీ లోపల పోసి చదును చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఐబీ అధికారులకు కనపడని నిర్మాణం
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని మునిపల్లి చెరువులో ప్రహారీ నిర్మాణం బహిరంగంగా కనపడుతున్నప్పటికి ఐబీ అధికారులకు మాత్రం ఎందుకు కనపడటంలేదో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చిన్న రైతులు తమ పొలాల్లోకి రాగడి మట్టి అవసరం నిమిత్తం చెరువుల నుండి కొద్దిపాటి మట్టిని తీసుకుంటే ముప్పుతిప్పలు పెట్టి కేసులు బనాయించే ఐబీ అధికారులు, ఇంత బహిరంగంగా మునిపల్లి చెరువులో ప్రహరీ నిర్మించినప్పటికి వారికి ఈ ప్రహరీ ఎందుకు కనపడటంలేదని పలువురు ఐబీ అధికారుల తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం
చూసిచూడనట్లు… రెవెన్యూ అధికారులు
హసన్ పర్తి మండలం మునిపల్లి చెరువులో యథేచ్ఛగా ప్రహరీ నిర్మించిన విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లినా వారు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చెరువుల వద్ద చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉండే నిరుపేదల గుడిసెలపై చర్యలు తీసుకునే రెవెన్యూ అధికారులు మునిపల్లి చెరువులో ఇంత బహిరంగంగా ప్రహరీ నిర్మించినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటికైనా రెవెన్యూ,ఐబీ అధికారులు స్పందించి ఆ నిర్మాణం పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే?