చివరికి భార్యపై కేసు పెట్టిన భర్త
భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాదంలో చనిపోయివారికోసం ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఓ మహిళ.. వింత నాటకాలు ఆడింది. ఏకంగా రైలు ప్రమాదంలో తన భర్త మరణించాడంటూ ప్రభుత్వానికి నివేదించి చివరకు చిక్కుల్లో పడింది.
కటక్ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా జూన్ 2న జరిగిన ప్రమాదంలో తన భర్త బిజయ్ దత్తా చనిపోయాడని, ఒక మృతదేహాన్ని తన భర్తదిగా గుర్తించినట్లు పేర్కొంది. అయితే, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత ఆమె వాదన తప్పు అని తేలింది.
పోలీసులు హెచ్చరించి ఆమెను విడిచిపెట్టినప్పటికీ, ఆమె భర్త మానియాబంధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. అరెస్టుకు భయపడి మహిళ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.
పూర్తివివరాల్లోకి వెళితే.. గత 13 ఏళ్లుగా దంపతులు విడివిడిగా జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. పరిహారం కాజేయడానికి తాను మరణించినట్లు పేర్కొన్నందుకు గీతాంజలిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజయ్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, పరిహారం కోసం నకిలీ దరఖాస్తులను తయారుచేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే, ఒడిశా పోలీసులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా ఆదేశించారు.
కాగా ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించగా, ప్రధాని నరేంద్ర మోదీ రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. మరోవైపు, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.
జూన్ 2న సాయంత్రం 7 గంటలకు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 288 మంది మరణించగా 1,200 మందికి పైగా గాయపడ్డారు.