makthal EXmla

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తెల్లవారుజామున దరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు. దయాకర్ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కొత్తకోట దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం గ్రామం. ఆయన మూడు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా..

1994, 1999లో అమరచింత నియోజకవర్గం నుంచి రెండు సార్లు, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషిచేసిన వారిలో దయాకర్ రెడ్డి ఒకరని ఆ పార్టీ నేతలు స్మరించుకుంటున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా దయాకర్ రెడ్డి పనిచేశారు.
దయాకర్ రెడ్డి, ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీతో ప్రత్యేక అనుబంధం ఉంది. రాజకీయ జీవితం మొత్తం టీడీపీలోనే సుదీర్ఘకాలం కొనసాగింది. సీతా దయాకర్ రెడ్డి కూడా ఆమె భర్తకు తోడుగా రాజకీయాల్లో కొనసాగారు. ఆమె 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా వీరు కొద్దికాలం టీడీపీలో కొనసాగారు. గత సంవత్సం ఆగస్టు నెలలో దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు.

కొద్దికాలానికి దయాకర్ రెడ్డి అనారోగ్యానికి గురి కావటంతో దయాకర్ రెడ్డి దంపతులిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటూవచ్చారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న దయాకర్ రెడ్డి.. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకొని స్వగ్రామం పర్కపురానికి వచ్చారు. కానీ ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చివరికి మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం…

మక్తల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతి తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. సమర్థుడైన నేతగా దయాకర్ రెడ్డిపేరు తెచ్చుకున్నారని చంద్రబాబు కొనియాడారు.

ప్రముఖుల నివాళి

మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతి బాధాకరమని టీడీపీ నేత అచ్చన్నాయడు అన్నారు. పార్టీకీ ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రజలకు విశేషమైన సేవలందించారని. దయాకర్ రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలోనూ సీమాంధ్రులతో తోడబుట్టిన సోదరుడిలా వ్యహరించారని గుర్తు చేసుకున్నారు. కొత్తకోట మృతికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు తదితరులు సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *