హన్మకొండ జిల్లా ఆత్మకూరు వద్ద ఘటన
హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండల కేంద్రం శివారులోని కటాక్షపూర్-ఆత్మకూరు మధ్య జాతీయ రహదారిపై ఓ టిప్పర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ, చిన్నారి ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతు లు నరసింహ స్వామి (50) , సాంబరాజు (42), ఆకాంక్ష (26) లక్ష్మీప్రసన్న(6) గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
అయితే వీరంతా ఉదయం కారులో ములుగు జల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలపాలైన వారు నలుగురు కారులోనే ప్రాణాలు విడిచినట్లు స్థానికులు తెలిపారు. వీరంతా వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందినవారని తెలుస్తోంది..