- జిల్లాలో రెచ్చిపోతున్న కొందరు తహశీల్దార్లు?
- అక్రమ రిజిస్ట్రేషన్లతో కోట్లకు పడగలెత్తుతున్న సదరు అధికారులు?
- ధరణిలోని లోపాలను అడ్డుపెట్టుకుని అక్రమాలు?
- తహశీల్దార్లకు సహకరిస్తున్న కొందరు ఆర్ఐలు?
బ్యూరో/ ప్రజాసర్కార్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంతమంది తహశీల్దార్లు బరి తెగించారు. ధరణి లోని చిన్నచిన్న లోపాలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను తమ తెలివితో క్షణాల్లోనే పరిష్కరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. కొన్నిసంవత్సరాలుగా తమ భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొందరు రైతులు.. తహశీల్దార్ లు అడిగినంత ముట్టజెప్పుకుంటున్నారు. లిటిగేషన్ ఉన్న భూములను టార్గెట్ చేసుకుంటూ ముడుపులు ముట్టజెప్పిన వారికే వత్తాసు పలుకుతున్నారు.
అక్రమ వెంచర్లకు వత్తాసు
జిల్లాలో పలుచోట్ల అక్రమ వెంచర్లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నరియల్టర్లకు కొందరు తహశీల్దార్లు కొమ్ముకాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరు చేస్తున్న అక్రమాలకు కొందరు ఆర్ఐ లు సైతం సహకరిస్తూ తహశీల్దార్ల అడుగుజాడల్లో నడుస్తున్నారట. తహశీల్దార్ ల కోసం ముడుపులను సేకరించడం.. తిరిగి వాటిని వాళ్ళ సార్లకు పువ్వుల్లో పెట్టి అప్పగించడం.. వారి వాటాను వారు తీసుకోవడం కొందరు ఆర్ఐ ల పని అని విశ్వసనీయంగా తెలిసింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది తహశీల్దార్లు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఈ మధ్యే సంగెo తహశీల్దార్ రాజేంద్రనాథ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొందరు తహశీల్దార్ లు ఏమాత్రం భయం లేకుండా పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా సదరు తహశీల్దార్లు తమ అవినీతి ఆలోచనలు మానుకొని సక్రమంగా విధులు నిర్వహిస్తారో లేదో చూడాలి.!